Kashi Viswanath Temple-కాశిక్షేత్ర ఆవిర్భావం, మన భారతదేశంలో ఉన్న క్షేత్రాలలో అత్యంత విశిష్టమైనది వారణాసి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9వ జ్యోతిర్లింగంగా ఉన్న క్షేత్రం వారణాసి/ కాశి. కాశి అవిముక్త క్షేత్రము ముక్తము అంటే విడిచిపెట్టుట అవిముక్తము అంటే ఎప్పటికీ విడిచిపెట్టని క్షేత్రం అని అర్థం. ఈశ్వరుడు సర్వకాలములయందు అక్షేత్రమును విడిచిపెట్టడు ఒకవేళ ఎవరైన క్షేత్రం విడిచిపెట్టు అని వరం కోరుకుంటే శరీరం కనబడకుండా అదృశ్య రూపంలో ఉంటాడు. కాశిలో శరీరం విడిచిపెట్టిన వాడు శాశ్వతమైనటువంటి ముక్తి పొందుతాడు. ఇలా అనేక విశేషములు ఉన్న కారణము చేత ఈ క్షేత్రమును అవిముక్తక్షేత్రం అని అంటారు. ఇప్పుడు మనం కాశీ క్షేత్రం ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి? మరియు ఆ క్షేత్రం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం.
Kasi Temple Avirbhavam-కాశిక్షేత్ర ఆవిర్భావం:
పూర్వం పార్వతిదేవి ఈ వారణాసి ఎలా ఆవిర్భవించింది అని శివుడిని అడిగింది. అప్పుడు శివుడు పార్వతి దేవికి సమాధానం చెప్తున్న వంకతో సకల జనుల కొరకు ఈ విధంగా వివరించాడు.అది సృష్టి ఆరంభకాలం ఎక్కడా పగలు లేదు రాత్రి లేదు.జీవులు లేరు కాబట్టి జీవాత్మ పరమాత్మ అనే భేదము లేదు.ఎక్కడా నక్షత్రాలు లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు,ముల్లోకాలు లేవు కటిక చీకటి తప్ప ఏమి లేదు. అప్పుడు శివుడు తన మూడవ నేత్రం తెరవగానే ఒక అపూర్వమైన జ్యోతి వచ్చింది ఆ కాంతి ప్రకాశించిన ప్రదేశం అంతా ఒక మహానగరంగా ఆవిర్భవించింది. మహాకాంతి స్వరూపంగా ప్రకాశించిన స్థలం కనుక కాశీ అన్నారు.ఆ మహా కాంతి చూస్తూ ఉండగా ఒక మహా అద్భుత నగరంగా మరియు మహా వైశాల్యంతో కూడినటువంటి నగరంగా మారిపోయింది. అంత పెద్ద నగరాన్ని భూదేవి భరించలేదు కనుక శివుడు ఆ నగరాన్నికుంచింప చేశాడు.
Vishnuvu Tapassu-విష్ణువు యొక్క తపస్సు:
పరమేశ్వరుడు కాశీ నగరాని సృష్టించిన తర్వాత క్రమక్రమంగా పరమాత్మ శరీరం నుంచి గణపతి, కుమారస్వామి, ప్రమద గణాలు, కాలభైరవుడు ఇలా మహాత్ములంతా పుట్టారు.ఇలా శివ పరివారం అంతా పెరిగింది. తదనంతరం శివుడు తన ఎడమ భాగం నుంచి నీల వర్ణంలో నాలుగు భుజాలతో కలిగిన ఒక మహాత్ముడిని సృష్టించాడు. అతడు పుట్టగానే పరమేశ్వర నా కర్తవ్యం ఏమిటి అనగా ఈరోజు నుంచి నువ్వు కాశీకి పోషకుడివి అంతటా వ్యాపించి ఉన్నావు కనుక నువ్వు విష్ణువు అని పిలవబడుతావు అని శివుడు పలికాడు.తదనంతరం విష్ణువు ఇంతటి కాశీ నగరాన్ని పోషించాలంటే దానికి ఎంతో తపో శక్తి కావాలి కనుక కాశీలో ఒక మంచి స్థలం చూసుకుని తపస్సు చేయాలని భావించి తన చక్రముతో ఒక మడుగు తవ్వాడు. చక్రము ద్వారా ఏర్పడిన తీర్ధం కనుక చక్ర తీర్థముగ పిలువబడింది. శ్రీమన్నారాయణ తన శ్రమజలాన్ని ఆ చక్రతీర్థం లో నింపారు.తదనంతరం అత్యంత నిష్ఠతో విష్ణువు మహా తపస్సు చేశాడు.
Kasi Viswanatha Jyothirlinga Avirbhavam-కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగ ఆవిర్భావం:
ఆ తపస్సుకు మెచ్చుకుని శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై ఒక్కసారిగా తాండవం చేశాడు ఆనందంతో తలను ఊపాడు ఊపగానే ఆయన కుడిచెవి నుండి ఒక పోగు ఊడి కింద పడింది. అలా పడిన ప్రదేశమే మణికర్ణిక ఘాట్ అని పిలవబడినది. తదనంతరం శివుడు విష్ణువు యొక్క తపస్సుకు మెచ్చి సమస్త లోకాలను పరిపాలించే శక్తి నీకు ఇస్తున్నాను భక్తులను అనుగ్రహించి పోషించి కాపాడు అని పలికాడు.అంతేకాకుండా లక్ష్మీ దేవిని సృష్టించి శ్రీమహావిష్ణువుకు పట్టాభిషేకం చేసాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు తనకు దర్శనం ఇచ్చిన ఈ కాశీ లో జ్యోతిర్లింగంగా వెలియాలని కోరగా అందుకు శివుడు సరేనని కోటి దివ్యకాంతులలో దగదగా వెలిగిపోతూ జ్యోతిర్లింగంగ వెలిశాడు. అప్పుడు శివుడు ఈ లింగం భూమి మీదకు వచ్చిన మొట్టమొదటి లింగం అని ఇది విశ్వేశ్వర జ్యోతిర్లింగంగ పిలువబడుతుందని, అలాగే పార్వతిదేవి అన్నపూర్ణగా మరియు విశాలాక్షిగా రెండు రూపాలతో ఇక్కడ కొలువై ఉంటుందని తాము ఈ వారణాసి లో కలియుగాంతం వరకు కొలువై ప్రజలను అనుగ్రహిస్తామని వరం ఇచ్చాడు.
How To Reach To Kasi-కాశీ క్షేత్రం ఎలా చేరుకోవాలి:
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లోని వారణాసి జిల్లాలో కాశి విశ్వనాథ జ్యోతిర్లింగం ఉంది.ఈ క్షేత్రం చేరుకోవడానికి బస్సు, రైలు మరియు విమాన మార్గాలు కలవు.
రైలు మార్గం:
మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా వారణాసి కంటోన్మెంట్ స్టేషన్కి గాని లేక కాశీ రైల్వే స్టేషన్కి గాని చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 5 KM ప్రయాణిస్తే కాశి విశ్వనాథ జ్యోతిర్లింగం చేరుకోవచ్చు.
విమాన మార్గం:
మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా వారణాసి ఎయిర్ పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 25 KM ప్రయాణిస్తే కాశి విశ్వనాథ జ్యోతిర్లింగం చేరుకోవచ్చు.
దర్శన వేళలు:
ఉదయం 3:00 నుండి రాత్రి 11:00 గంటల వరకు.