Places To Visit In Kashi-కాశీ ఆలయాలు దర్శించవలసిన క్రమము;కాశీ పుణ్యాలరాశి, పాపాలను భక్షించే రాకాసి కాశీ, కాశీ క్షేత్రంలో బ్రహ్మజ్ఞానం ఉన్నది, కాశీ క్షేత్రంలో మహదానందం ఉన్నది, కాశీ క్షేత్రానికి పునర్జన్మ లేకుండా చేసే శక్తి ఉన్నది, కాశీ క్షేత్రంలో సమస్త ఐశ్వర్యాలు అంతర్గతంగా ఉన్నాయి అందువలన దానిని అవిముక్త క్షేత్రం అని పిలుస్తారు. కాశీని దర్శించే భక్తులకు పరమేశ్వరుడు ఒక క్రమ పద్దతిన ఆలయాలను సందర్శించే నియమం పెట్టాడు. మొట్టమొదటి సారి కాశీ వెళ్లే భక్తులు ఈ క్రమ పద్దతిలో ఆలయాలు దర్శించడం వలన కాశీ యాత్ర సంపూర్ణ ఫలితం లభిస్తుంది.ఇప్పుడు ఈ ఆలయాల సందర్శన గురించి తెలుసుకుందాం. కాశీకి వెళ్లిన వాళ్లు మొదట గంగా స్నానం చేయవలెను, స్నానం అయ్యాక మొట్టమొదట మనం దర్శించవలసిన ఆలయం డుండి గణపతి ఆలయం.
Dundi Ganesh Temple-డుండి గణపతి ఆలయం
డుండి అనగా అన్వేషణ అని అర్ధం, ప్రజలకు ధర్మ,అర్ధ, కామ,మోక్షములను అన్వేషించి సిద్ధింప చేయగలడు కనుక డుండి గణపతిగా పిలువబడ్డాడు. కాశీ విశ్వనాథుడి దర్శనం కొరకు వెళ్లే 4 వ గేటు మార్గం లో ఈ డుండి గణపతి ఆలయం ఉంటుంది.ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటనగా పూర్వం దివోదాసుడు అనే రాజు వరం మేరకు దేవతలు కాశిని విడిచి వెళ్లిపోయారు. కొంతకాలం తర్వాత శివుడు తిరిగి కాశీకి రావాలనుకున్నాడు.అప్పుడు ముందుగా దేవతలను పంపి దివోదాసుడిని అధర్మమార్గం వైపు నడిచేటట్టు చేయమని చెప్పగా వాళ్ళందరూ విఫలమయ్యారు. చివిరికి వినాయకుడు ఒక జ్యోతిషుడి రూపంలో కాశి చేరుకొని దివోదాసుడికి కాశీ పైన వైరాగ్యం కలిగే టట్టు చేసి కాశీని విడిచిని వెళ్ళేలాగా చేసారు. తదనంతరం శివుడు కాశీకి తిరిగి వచ్చి డుండి గణపతి స్తోత్రంతో గణపతిని స్తుతించాడు. ఈ విధంగా డుండి గణపతి కాశీలో ఆవిర్భవించాడు.ఈ డుండి గణపతి మనకు కాశీ పట్టణంలో శాశ్వత నివాసాన్నిఅనుగ్రహిస్తాడు.డుండి గణపతిని దర్శించిన భక్తులు తదనంతరం అన్నపూర్ణాదేవిని దర్శించాలి.
Annapurnadevi Temple-అన్నపూర్ణాదేవి ఆలయం
పూర్వం శివుడు ఈ జగత్తులో ఉండేవంత అన్నంతో సహా మాయ అని చెప్పగా అందుకు పార్వతీదేవి శివుడికి అన్నం మాయకాదని తెలియచేయాలని భావించింది. తదనంతరం లోకం అంతా దరిద్రం ఆవహించి అన్నంలేక ప్రజలు ఆకలికి అలమటించేలా చేసింది. అప్పుడు శివుడు అన్నం మాయ కాదని గ్రహించి ఒక భిక్ష పాత్ర చేతబూని పార్వతి మాత వద్దకు భిక్ష కొరకు వచ్చాడు. అలా శివుడికి అన్నం పెట్టి ఆ రోజు నుంచి పార్వతీదేవి ఇక్కడ అన్నపూర్ణ దేవిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంది.ఈ ఆలయం కాశీ విశ్వనాథ మందిరానికి 15 మీటర్ల దూరంలో వాయువు దిశన దసస్వా రోడ్ లో ఉంటుంది. ఈ ఆలయం ఆవరణలో మరియు అనుబంధ ఆలయమైన శ్రీ రామాలయం లో ఉన్న దేవతలను దర్శించి తదనంతరం కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించాలి.
Kasi Viswanath & Dandapani Temple-కాశీ విశ్వనాథ & దండపాణి ఆలయం
కాశీ విశ్వనాథుడిని దర్శించే ముందు 4వ గేటు పక్కన ఉన్న దండపాణిని దర్శించాలి. పూర్వం హరి కేసుడు అనే యక్షుడి తపస్సును మెచ్చుకొని ఈశ్వరుడు ఒక దండం(కర్ర)ఇచ్చి కాశీ లో శాశ్వత నివాసం కల్పించాడు అప్పటి నుంచి ఆ యక్షుడు దండపాణిగా ప్రసిద్ధిగాంచాడు.ఈ దండపాణిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన కాశీలో మనకి నివాసయోగ్యం కలుగుతుంది. దండపాణి దర్శనం అనంతరం శనీశ్వరుడిని దర్శించాలి తదనంతరం కాశీ విశ్వనాథుడిని మరియు ఆలయ ఆవరణలో ఉన్న వివిధ లింగాలను దర్శించాలి. కాశీ విశ్వనాథుడి యొక్క చరిత్ర ఈ వెబ్సైటులో కలదు వీక్షించగలరు. తదనంతరం చింతామణి గణపతిని దర్శించాలి.
Chinthaman Ganesh Temple-చింతామణి గణపతి ఆలయం
ఈ చింతామణి గణపతి ఆలయం కేదార్ ఘాట్ వెళ్లే దారిలో ఉంటుంది. పూర్వం కపిల మహర్షి వద్ద చింతలను తీర్చే ఒక మణి ఉండేది. గణరాజు అనే ఒకరాజు ఆ మణి పైన ఆసక్తి కలిగి కపిలమహర్షి వద్ద నుంచి ఆ మణిని బలవంతంగా తీసుకుంటాడు. కపిలమహర్షి ఈ విషయాన్ని గణపతికి విన్నవించి ప్రార్ధించాడు అప్పుడు గణపతి ఆ రాజుని సంహరించి చింతామణిని మహర్షికి తిరిగి ఇచ్చాడు. అప్పటి నుంచి గణపతికి చింతామణి గణపతిగా పేరు వచ్చింది. ఈ చింతామణి గణపతిని దర్శించి పూజించడం వలన భక్తులకి ఉన్న చింతలన్నీ తొలుగుతాయి అని ప్రసిద్ధి. తదనంతరం కాలభైరవుడిని దర్శించాలి.
Kala Bhairav Temple-కాలభైరవ ఆలయం
కాలభైరవుడు కాశీ క్షేత్రానికి పాలకుడు కాశీ లోకి మనం ప్రవేశించాలి అంటే అయన అనుజ్ఞ ఉండాలి. ఈయన పుట్టగానే భయం కలిగించే ఒక పెద్ద రవము చేశాడట రవము అంటే శబ్దం అని అర్ధం, భయం కలిగించే రవము చేశాడు కనుక భైరవుడు అని మృత్యువును మరియు మనం చేసే పాపాలని శబ్దంతో తొలగిస్తాడు కనుక కాలభైరవుడు అని ప్రశస్తి గాంచాడు.అష్టమి నాడు కానీ ఆదివారం నాడు కానీ కాలభైరవుడిని దర్శించడం లాభదాయకం. ఈ ఆలయంలో ఒక దండం తో మన వీపుపైన కొడుతారు దీనిని భైరవ దండన అని అంటారు ఇలా చేయించుకోవడం వలన జీవుడికి ఊర్ధ్వ లోకాలు చేరుకున్నాక దండన నుంచి ఉపశమనం లభిస్తుంది. తదనంతరం బిందు మాధవుడిని దర్శించాలి.
Bindu Madhav Temple-బిందు మాధవ ఆలయం
బిందు మాధవ ఆలయం పంచగంగా ఘాట్ వద్ద ఉంటుంది. ఈ బిందు మాధవుడి క్షేత్రం పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి, అవి ఏమిటనగ కాశీలో బిందు మాధవుడు, ప్రయాగలో వేణీ మాధవుడు,రామతీర్థంలో లీలా మాధవుడు, పిఠాపురంలో కుంతి మాధవుడు, మరియు రామేశ్వరంలో సేతు మాధవుడు. పూర్వం అగ్నిబిందు అనే మహర్షి నేపాల్ లోని గండకీ నది వద్ద తపస్సు చేసి స్వయంభు సాలిగ్రామ మాధవుడి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. ఆ మహర్షి పేరులోని బిందు అనే పదం పైన ఈ దేవుడికి బిందు మాధవుడు అని పేరు వచ్చింది. ఈ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏమిటనగా ఒకే సాలగ్రామ విగ్రహం పైన 9 దేవతామూర్తులు ప్రతిష్టించబడ్డారు. ఈ బిందు మాధవుడి దర్శనం వలన సకల పాపాలు హరిస్తాయి అని ప్రశస్తి.తదనంతరం విశాలాక్షి మాతని దర్శించాలి.
Visalakshi Matha Temple-విశాలాక్షి మాత ఆలయం
అష్టాదశ శక్తీ పీఠాలలో ఒక పీఠం ఈ కాశీ విశాలాక్షి మాత ఆలయం, కాశీలోని మీర్ ఘాట్ దగ్గర ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి పౌరాణిక పరంగా విశేషమైన చరిత్ర ఉంది.పూర్వం దక్షయజ్ఞంకి తన భర్త శివుడిని ఆహ్వానించకుండా అవమానించినందున సతీదేవి ఎంతో దుఃఖం తో అగ్నికి ఆహుతియింది అప్పుడు శివుడు అమ్మవారి శరీరాన్ని భుజాన వేసుకొని తాండవం చేస్తుండగా విష్ణువు శివుడి యొక్క దుఃఖాన్ని తగ్గించాడనికి అమ్మవారి శరీరాన్ని ముక్కలుగా తన కోదండంతో ఖండించారు. అప్పుడు అమ్మవారి శరీర భాగాలూ ఈ భూమి పైన 108 ప్రదేశాలలో పడి శక్తీ పీఠాలుగా వెలిసాయి వాటిలో 18 శక్తిపీఠాలు ప్రఖ్యాతిగాంచాయి. అలా అమ్మవారి శరీర భాగంలోని చెవిభాగం ఈ ప్రదేశంలో పడి శక్తిపీఠంగా ఆవిర్భవించింది.తదనంతరం యమధర్మేశ్వర లింగాన్నిదర్శించాలి.
Yamadharmeswara Lingam-యమధర్మేశ్వర లింగం
పూర్వం యముడు ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి శివుడి కోసం నాలుగు యుగాల పాటు భయంకరమైన తపస్సు చేసాడు. ఆ తపస్సు కు మెచ్చి శివుడు ప్రత్యక్షమవ్వగ, యముడు ధర్మ కృత శివ స్తోత్రంతో శివుడిని స్తుతించాడు. అందుకు సంతోషించిన శివుడు యముడిని ధర్మరాజుగా ఉండమని ఆదేశించి దక్షిణ దిక్కుకు అధిపతిని చేసాడు. తదనంతరం శివుడు “నీవు ప్రతిష్టించిన ఈ లింగాన్ని దర్శించి పూజించిన స్పృశించిన సర్వ పాపాల నుండి విముక్తులవుతారని ఆ గుడి ప్రాంగణం లో ఉన్న ధర్మ కూపంలో స్నానం చేసి ఈ లింగాన్ని దర్శించడం వలన ధర్మ అర్ధ కామ మోక్షములు వెంటనే సిద్ధిస్తాయి” అని వరం ఇచ్చాడు.కార్తీక శుక్ల అష్టమి నాడు ఉపవాసం ఉండి ఆ రోజు అక్కడే జాగరణ చేసిన వారికీ పునర్జన్మ ఉండదు అని శివుడు యముడితో చెప్పాడు.ఈ ఆలయం లో ధర్మరాజు శివ కేశవుల పైన చేసిన అష్టోత్తర శతనామావళిని చెక్కి ఉంచారు గమనించగలరు. కాశి క్షేత్రంలోని ఈ ప్రాంగణంలో శివ కేశవ అష్టోత్తర శతనామావళి పఠించిన వారికి పునర్జన్మ ఉండదు.తదనంతరం దివోదాసేశ్వర లింగాన్ని దర్శించాలి.
Divodaseswara Lingam-దివోదాసేశ్వర లింగం
దివోదాసేశ్వర లింగం విశ్వభుజ గౌరీ మాత ఆలయం లో ఉంటుంది. పూర్వం లోకం మొత్తం కరువుతో అలమటిస్తుండటంతో బ్రహ్మ గారు ఒక సత్పురుషుడైన రిపుంజయుడిని రాజును చేయాలని భావించాడు. అప్పుడు రిపుంజయుడు తను ఈ భూమిని పరిపాలించాలంటే దేవతలు ఈ భూమి మీద ఉండకూడదు అని బ్రహ్మను కోరాడు, ఆ విధంగా దేవతలంతా భూమిని విడిచి వెళ్ళిపోతారు. ఆ రిపుంజయుడు దివోదాసుగా మారి 80 వేల సంవత్సరాలు భూమిని ధర్మ బద్దంగా పాలించాడు. కొంత కాలానికి శివుడికి తిరిగి కాశీ రావాలని అనిపించగా శివుడు మొదట కొంత మంది దేవతలను పంపి దివోదాసుడిని అధర్మం వైపు మరల్చమని చెప్పాడు కానీ అది సాద్యపడలేదు చివరికి విఘ్నేశ్వరుడిని పంపగా ఆయన ఒక జ్యోతిషుడిగా మారి దివోదాసుడి వద్దకు వెళ్లి 18 రోజుల తరవాత ఒక గురువు దర్శనం వలన మంచి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. తదనంతరం విష్ణువు గురువు రూపం లో భూమి మీదకు వచ్చి కాశీరాజుకు రాజ్యం పైన వైరాగ్యం కలిగేటట్టు చేస్తాడు. అప్పుడు కాశీ రాజు తన రాజ్యాన్నికుమారుడికి అప్పగించి ఒక లింగాన్ని ప్రతిష్టించి పూజించగా కొన్నిరోజుల తరవాత కైలాసం నుంచి శివ దూతలు వచ్చి దివోదాసుడిని సశరీరంగా కైలాసంకి తీసుకెళ్లారు. ఈ దివోదాసేశ్వర లింగాన్ని పూజించడం వలన పాపాలు తొలగి చేపట్టిన పనులలో విజయం చేకూరుతుందని కాశీ ఖండంలో చెప్పబడి ఉంది .తదనంతరం బ్రహ్మేశ్వర లింగాన్ని దర్శించాలి.
Bramheswara Lingam-బ్రహ్మేశ్వర లింగం
భూలోకంలో పూజలకు నోచుకోని ఆ బ్రహ్మ దేవుని అనుగ్రహం పొందాలంటే ఆ బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్టించిన లింగాన్ని పూజించాలి. పంచ గంగా ఘాట్ దగ్గరలో ఉన్న బ్రహ్మ చారిని అమ్మవారి ఆలయంలో బ్రహ్మ దేవుడు ప్రతిష్టించిన బ్రహ్మేశ్వర లింగం ఉంటుంది. పూర్వం శివుడి ఆజ్ఞ మేరకు దివోదాసు అనే రాజుని కాశీ నుంచి పంపించేయడానికి వచ్చిన బ్రహ్మ, కాశీ రాజు చేత పది అశ్వమేధ యాగాలు చేయించి దివోదాసు వద్ద ఉన్న ధనం ఖర్చు అయ్యేట్టు చేసి అతనిని అధర్మ మార్గం వైపు వెళ్లే లాగ చేయాలని ప్రయత్నించాడు. కానీ బ్రహ్మదేవుడు ప్రయత్నం విఫలమవ్వగా బ్రహ్మ దేవుడు ఒక లింగాన్ని ప్రతిష్టించి పూజించసాగాడు ఆ లింగమే బ్రహ్మేశ్వర లింగం. విశ్వనాథ లింగానికి సమానమైన ఈ లింగాన్ని పూజించడం వలన బ్రహ్మదేవుడి అనుగ్రహం పొంది బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. కాశీలో బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన లింగాలు మరో రెండు కలవు ఒకటి దశాశ్వమేధ ఘాట్ దగ్గర లోనే ఉంటాయి దర్శించగలరు.ఇది కాశీ యాత్ర చేయవలసిన క్రమము, పైన చెప్పిన ఆలయాలె కాకుండా నవగ్రహాలచేత,అష్టదిక్పాలకులు చేత మరియు ఇతర దేవి దేవతల చేత ప్రతిష్ఠింపబడిన లింగాలు కూడా కలవు దర్శించగలరు ఇంతటితో కాశీ యాత్ర సంపూర్ణం.
FAQ: