Must Visit Temples In Ujjain మన భారత దేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం ఉజ్జయిని. పూర్వం దేవ దానవులు అమృతం కోసం సాగరమదనం చేయగా అమృత బాండం ఉద్భవించింది. అ అమృత బాండంలోని కొన్ని బిందువులు భూమి మీద నాలుగు ప్రదేశాలలో పడ్డాయి అవే హరిద్వార్, నాసిక్, ప్రయాగ మరియు ఉజ్జయిని. అందుకని ఈ నాలుగు ప్రదేశాలలో 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. ఉజ్జయిని సప్త మోక్షపురాలలో ఒక మోక్ష పురం అంతే కాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తీపీఠం, భూదేవి పుత్రుడైన అంగారకుడు జన్మించిన ప్రదేశం, ఇలా చెప్పుకుంటూ పోతే ఉజ్జయిని ఎన్నో విశిష్ఠమైన ఆలయాలకు నెలవు. అటువంటి ఉజ్జయిని క్షేత్రం సందర్శించినప్పుడు తప్పకుండ దర్శించవలిసిన ఆలయాలు మరియు తీర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Ujjain Mahakaleswar Temple-ఉజ్జయిని మహాకాళేశ్వర మందిరం
ఉజ్జయిని మహాకాళేశ్వరుడు క్షిప్రా నది తీరాన అలరారుతున్నాడు, ఈ మహాకాళేశ్వర ఆలయం మూడంతస్తుల ఆలయం. ఇందులో ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క శివలింగం ప్రతిష్టించబడి ఉన్నాయి. మొదటి అంతస్తులో మహాకాళేశ్వర లింగంగా ఆపై అంతస్తులో ఓంకార లింగంగా దానికి పైన నాగచంద్రేశ్వర లింగంగా పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. నాగచంద్రేశ్వర లింగాన్ని కేవలం నాగపంచమి రోజున మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.ఈ ఆలయం లో శివలింగానికి జరిగే భస్మ హారతి చాల ప్రత్యేకం.ఈ ఆలయాన్ని1736వ సంవత్సరంలో మరాఠా జనరల్ రానోజి సింథియా పునఃనిర్మించారు.ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మహద్ జీ సింథియా, దౌలత్ రావ్ సింథియా, జయాజీ రావ్ సింథియాలు ఈ ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దారు. 1947 తర్వాత మహాకాళేశ్వర్ ప్రభంజన్ సమితి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్వహణ సాగుతుంది.
Chintaaman Ganesh Temple-చింతామణి గణేశ మందిరం
చింతామణి గణేశ మందిరం మహాకాళేశ్వర మందిరం నుంచి 6 KM దూరంలో ఉంటుంది. ఈ చింతామణి గణేశుడుని పూజిస్తే చింతలన్నీ తొలగుతాయని భక్తుల విశ్వాసం .ఈ చింతామణి గణేశుడు మూడు రూపాల ఏక స్వరూపంగా కొలువై ఉన్నాడు. చింతామణి గణపతి రూపం పక్కన సిద్ధి వినాయకుడి రూపం దానిపక్కన ఇచ్చావన్ గణపతి రూపంతో మూడు రూపాల గణపతిగా ఒకే విగ్రహంలో దర్శనమిస్తాడు. ఈ చింతామణి గణేశుడు స్వయంభుగా వెలసిన గణేశుడు. ఈ మందిరానికి సంబంధించి ఒక పురాణం వృత్తాంతం ఉంది, పూర్వం రుగ్మాంగదుడు అనే రాజు ఉండేవాడు అతను ఎంతో అందగాడు. అతడిని ఒక ఋషిపత్నిశపించడం వలన అందవిహీనంగా కురూపిగా మారిపోతాడు. తన రూపాన్ని తనే చూసుకోలేక ఆ రాజు ఎంతో విలపించసాగాడు. అప్పుడు త్రిలోకసంచారుడైన నారద మహర్షి యొక్క సూచన మేరకు చింతామణి గణపతిని పూజించి తిరిగి పూర్వ రూపాన్ని పొందుతాడు.
Harasiddhi Matha Temple-హరసిద్ధి మాత మందిరం
మహాకాళేశ్వర మందిరం నుంచి హరసిద్ధి మాత మందిరం కేవలం 0.6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శనమిస్తుంది. ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి, దక్షయజ్ఞం అనంతరం సతీ దేవి యొక్క మోచేయి ఈ ప్రదేశంలో పడిందని శివ పురాణం ద్వారా తెలుస్తుంది. స్కంద పురాణం ప్రకారం కైలాసంలో శివ పార్వతులు ఆనంద విహారంలో ఉండగా చండ ప్రచండ అనే ఇద్దరు రాక్షస సోదరులు వారి ఆనందానికి భగ్నం కలిగించారు ఈశ్వరుని ఆదేశం మేరకు పార్వతి దేవి చండి రూపంలో ఆ ఇద్దరి సోదరులని సంహరించింది అందుకే ఈ ఆలయం హరసిద్ధి మందిరంగా పేరుగాంచింది. విక్రమాదిత్యుడు హరసిద్ధిమాతను కులదేవతగా పూజించేవాడు, అమ్మవారి కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆత్మ సమర్పణలో భాగంగా 11సార్లు తన శిరస్సును ఖండించి సమర్పించాడని అలా సమర్పించిన ప్రతిసారి తిరిగి శరీరంతో కలిసిపోయేదని 12వ సారి మాత్రం శిరస్సు శరీరం వేరై విక్రమాదిత్యుడు అమ్మవారిలో ఐక్యమయ్యాడని స్ధల పురాణ సారాంశం.
Gad Kalika Mandir-గడ్ కాళికా మాత మందిర్
మహాకాళేశ్వర మందిరం నుంచి గడ్ కాళికా మాత మందిర్ 3.6 KM దూరంలో ఉంటుంది. ఈ మా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, దక్షయజ్ఞం అనంతరం సతీ దేవి యొక్క పై పెదవి ఈ ప్రదేశంలోనే పడిందని శివ పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో అమ్మవారి మూర్తి విరాట్ రూపంలో నాలుక చాపి భయంకరంగా మనకి దర్శనమిస్తుంది. ఒక పల్లెటూరి గొర్రెల కాపరిని మహాకవి కాళిదాసుగా మార్చిన మహిమాన్విత అమ్మ వారు గడ్ కాళికా. ఇప్పుడు ఈ ఆలయానికి సంబందించిన పురాణ విశేషాలు తెలుసుకుందాం. పూర్వం రావణాసురుని సంహరించిన తర్వాత శ్రీరామచంద్రుడు సపరివార సమేతంగా అయోధ్యకు తిరిగి వెళుతుండగా ఈ మందిరాన్ని దర్శించి ఇక్కడ సేదతీరారని ఇతిహాస కధనం.
Kala Bhairava Temle-కాలభైరవ స్వామి మందిరం
గడ్ కాళికా మాత మందిర్ నుంచి కాలభైరవ ఆలయం 2.5 KM దూరంలో ఉంటుంది. కాలభైరవుడు యొక్కవాహనం శునకం, ఉజ్జయిని నగరానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు. శివుడిని దుర్భాషలాడే వాళ్ళను శిక్షించటానికి ఉద్భవించిన వాడే కాలభైరవుడు .ఈ స్వామి శివుడి యొక్క గోరు నుంచి ఉద్భవించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో కేవలం కాలభైరవుడి శిరోభాగం మాత్రమే మూలవిరాట్ గా దర్శనమిస్తుంది.ఈ కాలభైరవుడికి జరిగే అర్చనలు మరియు నైవేద్యాలు చాల విలక్షణంగా ఉంటాయి.ఈ కాలభైరవుడికి మద్యాన్ని నివేదించి మిగిలిన మద్యాన్నిమనకు ప్రసాదంగా ఇస్తారు. ఈ ఆలయంలో పూర్వకాలం తాంత్రిక పూజలు జరిగేవని అప్పుడు కాలభైరవునికి మద్యం, మాంసం మరియు ఇతర పదార్ధములు సమర్పించేవారని కాలక్రమేనా మిగిలిన వాటిని వదలి కేవలం మద్యాన్ని మాత్రమే నివేదిస్తున్నారు.
Mangalnath Temple-మంగళ్ నాథ్ మందిరం
కాలభైరవ ఆలయం నుంచి మంగళ్ నాథ్ ఆలయం 2 KM దూరంలో ఉంటుంది. మంగళుడు ఉజ్జయినిలోనే జన్మించాడని మత్స్య పురాణం ద్వారా తెలుస్తుంది. మంగళుడిని అంగారకుడు లేక కుజుడు అని పిలుస్తారు, ఈ మంగళుడు శివుడు మరియు భూమాత యొక్క పుత్రుడిగా పురాణాలు అభివర్ణిస్తాయి. అలాగే భూదేవి యొక్క పుత్రుడు కనుక మంగళుడికి భౌమ్యుడు అని కూడా పేరు వచ్చింది. ఈ క్షేతంలో శివుడు మంగళనాధ శివలింగంగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ శివుడు స్వయంభుగా వెలవడానికి వెనక ఒక పురాణ కధనం ఉంది. పూర్వం అందకాసురుడు అనే అసురుడుతో పరమశివుడికి యుద్ధం జరిగిందని ఈ ప్రదేశంలోనే శివుడి యొక్క స్వేద బిందువు భూమి మీద పడి స్వయంభు శివలింగంగా వెలసిందని స్కాంద పురాణం ద్వారా తెలుస్తుంది. జన్మ జాతకంలో కుజదోషం ఉన్నవారు ఈ ఆలయంలో దోష నివారణ పూజ చేయించుకోవడం వలన కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.
Saandipani Maharshi Ashramam-సాందీపని మహర్షి ఆశ్రమం
మంగళ్ నాథ్ ఆలయం నుంచి సాందీపని మహర్షి ఆశ్రమం 2 KM దూరంలో ఉంటుంది. శ్రీకృష్ణుడు మరియు సుధాముడు ఈ ఆశ్రమం లోనే విద్యనభ్యసించారు. ఈ ఆశ్రమం లో సాందీపని మహర్షిచే ప్రతిష్టింపబడిన శివలింగం మరియు శ్రీకృష్ణుడు విద్యనభ్యసించిన పాఠశాల కానవస్తాయి.ఆ పక్కనే గోమతి కుండ్ ఉంటుంది, ఈ కుండం లో శ్రీకృష్ణుడు తన గురువుకోసం సకల పుణ్య తీర్థాల జలం తీసుకొచ్చి నింపారని ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది.
Kshipra River-క్షిప్రా నది
ఉజ్జయిని క్షేత్రానికి పుష్కరినిగా,తీర్థముగా మరియు మహా కోనేరుగా ఒదిగిన నది మాత క్షిప్రా నది. ఈ నది యొక్క ఆవిర్భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం శివుడు భిక్ష కొరకు బ్రహ్మ కపాలంను చేతపట్టి ముల్లోకాలు తిరుగుతూ విష్ణువు వద్దకు వెళ్ళాడు. అప్పుడు విష్ణువు చూపుడువేలతో పొమ్మన్నట్టుగా సైగ చేశాడు అందుకు ఆగ్రహించిన పరమశివుడు తన త్రిశూలంతో విష్ణువు యొక్క చూపుడు వేలును ఖండించగా రక్తం కారి బ్రహ్మ కపాలం పూర్తిగా నిండిపోయింది ఆ ప్రవాహమే పవిత్ర క్షిప్రా నదిగా భూలోకంలో ప్రవహించిందని ఒక పురాణ కధనం. క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఘాట్లలో అతి పురాతనమైనది రామ్ ఘాట్. రాములవారు తన తండ్రి శ్రాద్ధ కర్మలు నిర్వహించాక ఈ ప్రదేశంలోనే స్నానం చేశారట అందుకని ఈ ప్రదేశానికి రామ్ ఘాట్ అని పేరు వచ్చింది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహా కుంభమేళా నిర్వహించే నాలుగు ప్రదేశాలలో ఈ క్షిప్రా నది కూడా ఒకటి. అంత పవిత్రమైన నది కనుక ఈ నదికి కూడా గంగా నదిలాగే సాయంకాలం పూట హారతులు ఇస్తారు.
Mahakal Corridor-మహాకాళ్ కారిడార్
మహాకాళేశ్వర మందిరం నుంచి మహాకాళ్ కారిడార్ 1 KM దూరంలో ఉంటుంది. ఈ కారిడార్ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేత 2022 అక్టోబరు నెలలో ప్రారంభించబడినది. ఈ కారిడార్కు రెండు ప్రవేశ ద్వారాలు కలవు నందిద్వార్ మరియు పినాకిద్వార్. ఈ ద్వారాల గుండా లోపలికి ప్రవేశించిన మనకు 108 రాజస్థాన్ రాతి స్తంభాలు ,50 కి పైగా శివపురాణాన్ని తెలిపే చిత్రీకరణలు, శివ పరివారము యొక్క విగ్రహాలు, కమల్ సరోవర్ మరియు శివుడి చుట్టూ ఉన్నసప్త ఋషుల విగ్రహాలు మొదలగునవి దర్శనమిస్తూ ఇట్టే ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా మహాకాళ్ కారిడార్ సందర్శించిన వారు సేద తీరటానికి త్రివేణి మండపం, అలాగే ఉజ్జయినిలో జరిగిన చరిత్రలు, పురాణాల గురించి తెలియజేసే విధంగా త్రివేణి మ్యూజియం ఉన్నాయి.ఈ కారిడార్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకొని సందర్శకులకి ఆహ్లాదకరమైన అనుభూతినిస్తాయి.