Kashi Annapurnadevi Temple-కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం, కాశీ యాత్ర చేసే వారు కాశీ విశ్వనాథుడిని దర్శనం తో పాటు కాశీ అన్నపూర్ణాదేవిని కూడా దర్శిస్తారు.ఈ ఆలయాన్ని మరాఠా మొదటి పీష్వా బాజీరావు 1729 లో నిర్మిచారు. ఈ ఆలయం కాశీ విశ్వనాథ మందిరానికి 15 మీటర్ల దూరంలో వాయువు దిశన దసస్వా రోడ్ లో ఉంటుంది. ఈ జగత్తు మొత్తానికి అన్నం ప్రసాదించి భక్తులను అనుగ్రహించే కాశీ అన్నపూర్ణాదేవి గురించి మరియు ఈ ఆలయం ఆవరణలో ఉన్న కుబేరేరుడు, యంత్రేశ్వరుడు, చింతాహరన్ గణేష్, ఆంజనేయుడు , సత్యనారాయణ స్వామి ,సూర్య భగవానుడు మొదలైన దేవతా మూర్తులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Kashi Annapurna Devi Mahimalu-కాశీ అన్నపూర్ణ దేవి మహిమలు
పూర్వం శివుడు ఈ జగత్తులో అన్నం తో సహా ఉన్నవన్నీ మాయ అని చెప్పగా అందుకు పార్వతీదేవికి కోపం వచ్చి అన్నం మాయకాదని శివుడికి తెలియచేయాలని భావించింది. అప్పుడు పార్వతీదేవి ఒక్కసారిగా లోకం అంతా దరిద్రం ఆవహించి అన్నం లేక ప్రజలు ఆకలికి అలమటించేలా చేసింది అప్పుడు శివుడు అన్నం మాయ కాదని గ్రహించి తానే ఒక భిక్ష పాత్ర చేతబూని పార్వతీమాత వద్దకు భిక్ష కొరకు వచ్చాడు. అలా శివుడికి అన్నం పెట్టి ఆ రోజు నుంచి పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణాదేవి కొలువై భక్తులను అనుగ్రహిస్తుంది.ఈ అమ్మవారి దర్శనం వలన మేధాశక్తి, సమయస్ఫూర్తి , ఐశ్వర్యం మరియు వాక్సుద్ధి కలుగుతాయి. కాశీఖండం ప్రకారం చైత్రమాసం శుక్లపక్ష అష్టమి రోజున అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేయడం వలన ఈ విశ్వం మొత్తం ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది. కాశీవాసం చేసేవారు ఈ అమ్మవారికి ప్రతిరోజు 8 ప్రదక్షిణలు చేయడం వలన వారికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారు చూసుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ గుడి లో ఉన్న అమ్మవారి బంగారు విగ్రహన్ని దీపావళి ముందు వచ్చే ధనత్రయోదసి నుంచి నాలుగు రోజుల పాటు భక్తుల దర్శనం కోసం అనుమతిస్తారు.
Kubera & Anjaneya Temples-కుబేర & ఆంజనేయ ఉప ఆలయాలు :
కాశీ ఖంఢం ప్రకారం పూర్వం కుబేరుడు ఒక శివలింగాన్ని ప్రతిష్టించి 10 లక్షల సంవత్సరాల పాటు శివుడి కోసం తపస్సు చేసాడు. ఆ తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు అమ్మవారి సమేతంగా ప్రత్యక్షమై కుబేరుడిని ఉత్తరదిక్కుకు పాలకుడిని చేసాడు. అంతేకాకుండా కుబేరుడు ప్రతిష్టించిన శివలింగం కుబేరేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందుతుందని పలికాడు.అప్పుడు పార్వతీదేవి ఈ లింగాన్ని దర్శించిన వాళ్ళకి సర్వ పాపములు పోయి సర్వ సిద్దులు పొందుతారని అలాగే వాళ్లకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని బందు మిత్రుల వియోగం ఉండదని వరం ఇస్తుంది. ఈ అన్నపూర్ణ ఆలయంలోనే ఆంజనేయస్వామి ఉపఆలయాన్నికూడా దర్శించగలరు.
Drupadadithya & Chintha Haran Ganesh Temples-ద్రుపదాదిత్యుడు & చింతాహరన్ గణేష్ ఆలయాలు :
పూర్వం పాండవులతో కలిసి వనవాసం వచ్చిన ద్రౌపది దేవి సూర్య భగవానుడిని ప్రాదించగా సూర్యుడు ఒక అక్షయ పాత్ర ప్రసాదించి ప్రతిరోజూ ఎంత మంది అతిధులు వచ్చిన వారికీ సరిపడ ఆహరం ఇందులో లభిస్తుందని వరం ఇచ్చాడు.అలాగే ద్రౌపది దేవి చేసిన తపస్సు కారణంగా సూర్య భగవానుడు ద్రుపదాదిత్యుడుగా కొలువై ఉంటాను అని పలికాడు. ఈ ద్రుపదాదిత్యుడిని ప్రాదించిన భక్తులకు ఆకలి బాధలు ఉండవని వరం ఇచ్చాడు.ఆ ప్రక్కన చింతాహరన్ గణేష్ కలరు దర్శించుకోండి.కాశి లో ఉన్న 56 వినాయకులలో ఈ వినాయకుడు ఒకడు ఈ వినాయకుడిని దర్శించి పూజించడం వలన జీవితంలో తాము అనుకున్నది సాధించగలరు.
Satyanarayana & Yanthreswara Temples-సత్యనారాయణ స్వామి & యంత్రేశ్వర ఆలయాలు :
ఈ భూమండలం పైన మొట్టమొదటిసారిగా సత్యనారాయణ వ్రతం జరిగిన ప్రదేశం కాశీలోని అన్నపూర్ణాదేవి ఆలయంలో ఉన్నది. ఆ స్థలం లో ఇప్పటికీ సత్యనారాయణ స్వామి ప్రతిమ కలదు దర్శించగలరు. కాశీలో ఉన్న షోడశ విష్ణువుల లో ఒక రూపం ఈ సత్యనారాయణ రూపం. ఇప్పుడు యంత్రేశ్వర లింగం గురించి తెలుసుకుందాం.
ఈ యంత్రేశ్వర లింగాన్ని లలితా సహస్రనామానికి వ్యాఖ్యానం రచించిన శ్రీ భాస్కర రాయలు వారు ప్రతిష్టించారు.ఈ లింగం పైన శ్రీ చక్ర యంత్రం చెక్కబడి ఉన్నది, యంత్రము చెక్కబడి ఉన్నది కనుక ఈ లింగం యంత్రేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందినది. శివుడు లింగ రూపం లో దర్శనం ఇవ్వగా అమ్మవారు శ్రీ చక్ర రూపం లో ఉంటూ మనల్ని ఆశీర్వదిస్తారు. ఇక్కడ లలితాసహస్రనామం ఒక్కసారి పారాయణం చేస్తే కొన్ని కోట్ల సార్లు పారాయణం చేసిన ఫలితం వస్తుందని అమ్మవారు వరం ఇచ్చారు.ఇప్పుడు ఈ అన్నపూర్ణాదేవి ఆలయానికి అనుబంధ ఆలయంగా ఉన్న శ్రీ రామ ఆలయంలో కొలువైయున్న దేవి దేవతల విశిష్ట గురించి తెలుసుకుందాం.
Bhadrakali & Bhavani Gouri Temples-భద్రకాళి & భవాని గౌరీ ఆలయాలు :
పూర్వం ఈ ప్రదేశంలో భద్రకాళి అమ్మవారు 1000 సంవత్సరాలు తపస్సు చేసి వెలిసింది. ఇక్కడ అమ్మవారి పెద్ద దేవాలయం ఉండేది ఔరంగజేబు కాలంలో ఈ ఆలయం ధ్వంసం కాబడినది తదనంతరం భక్తులు ఒక సామాన్య విగ్రహాన్ని స్థాపించి పూజించసాగారు. ఈ అమ్మవారి వద్దనే రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానంద కొన్ని రోజులు సాధన చేసారు.ఇప్పుడు భవాని గౌరీ అమ్మవారి గురించి తెలుసుకుందాం.
భవాని గౌరీ అమ్మవారు చాలా శక్తి కలిగిన మహిమాన్వితమైన అమ్మవారు. కాశీ ఖండం ప్రకారం నవ గౌరీ యాత్ర 7 వ రోజున ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. సాధారణంగా ఈ నవ గౌరీ యాత్ర చైత్ర మాసం లో వచ్చే వసంత నవరాత్రులలో చేస్తుంటారు. అంతే కాకుండా ప్రతి మాసం లో శుక్ల తదియ రోజున అనగా అమావాస్య తరువాత వచ్చే 3 వ రోజున ఈ నవ గౌరీ యాత్ర చేస్తే మంచిది.అంతే కాకుండా చైత్ర శుక్ల తదియ రోజున అమ్మవారిని దర్శించుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. కాశీ ఖండం ప్రకారం భవాని గౌరీ అమ్మవారిని దర్శించుకోవడం వలన జీవితంలో కష్టాలు తొలిగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. భవాని గౌరీ అమ్మవారి దగ్గరే భవానీశ్వర లింగం ఉంది భవాని తీర్ధం లో స్నానం చేసి ఈ దంపతులని దర్శించడం మంచిది. భవాని గౌరీ అమ్మవారి ప్రక్కనే బలభద్ర సుభద్ర సమేత పూరి జగన్నాథ స్వామి వారు కలరు వారి ప్రక్కన శ్రీ గాయత్రి, మహాలక్ష్మి & సరస్వతి అమ్మవార్లు కలరు దర్శించుకోండి.
Gangavatharanam & Lakshmi Narayana Temple-గంగావతరణం & లక్ష్మి నారాయణ ఆలయం:
పూర్వం ఇక్ష్వాకు వంశం లో జన్మించిన భగీరధుడి పూర్వీకులకు శాపం కలగడం వలన మోక్షరహితులయ్యారు. భగీరధుడు తన పూర్వీకులకు మోక్షం కలిగించడానికి గంగాదేవికి మహా తపస్సు చేశాడు.గంగ దేవిని భూమి మీదకు తీసుకువచ్చే క్రమములో శివుడికి తపస్సు చేసి మెప్పించాడు .ఈ విధంగా భగీరథుని తపస్సు ఫలితం వలన గంగాదేవి భారతదేశం అంతటా ప్రవహించినది. ఇలా గంగావతరణంకు సంబంధించిన కథ చదవడం లేదా వినడం చేత మనసు మారి భగవంతుని పైన శ్రద్ధ కలిగి సత్కర్మలు చేసి లోకం చేత కీర్తింపబడుతారు.ఈ గంగా అవతరణ జరిగిన తర్వాత గంగాదేవి కూడా ఈ ప్రదేశంలోనే తపస్సు చేసింది, కనుక అక్కడ గంగాదేవి ప్రతిమ ఉంటుంది దర్శించగలరు.
గంగాదేవి ఉప ఆలయం ప్రక్కన లక్ష్మి నారాయణులు కొలువై ఉన్నారు. వీరి ప్రక్కన సీత రామ లక్ష్మణ భరత సమేత హనుమంతుల వారు కొలువై ఉన్నారు. వారి ప్రక్కన రాధా క్రిష్ణులు ఉన్నారు వారికీ కుడి వైపుగా శివ పార్వతులు కార్తికేయుడు వినాయకులు ఉన్నారు. శివ పార్వతుల మందిరం ఎదురుగా భవాని కూపం ఉంటుంది.
Narsimha & Pathaleswara Temples-నరసింహ స్వామి & పాతాళేశ్వర ఆలయాలు :
ఈ ప్రదేశం లోనే పూర్వం ప్రహ్లాదుడు నరసింహ స్వామి కోసం తపస్సు చేయగా స్వామి వారు ప్రత్యక్షమై అనుగ్రహించారు కనుక అక్కడ నరసింహ స్వామి యొక్క ప్రతిమ ఉంటుంది. కాశీ లో ఉన్న నవ నరసింహులలో ఒక స్వరూపం ఈ స్వామి.ఇప్పుడు పాతాళేశ్వర లింగం గురించి తెలుసుకుందాం.
ఈ శివలింగం పాతాళం నుంచి ఉద్భవించింది కనుక పాతాళేశ్వర లింగం అని అలాగే శివరాత్రి రోజున ఉద్భవించాడు కనుక శివరాత్రేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ శివలింగం అన్నపూర్ణాలయానికి ఎదురుగా ఉన్న ప్రదేశం లో ఉంటుంది దర్శించండి.ఇంతటితో అన్నపూర్ణాదేవి ఆలయ విశేషాలు వివరణ సంపూర్తి.