12 Surya Temples in Kashi- కాశీ ద్వాదశ ఆదిత్యులు

12 Surya Temples in Kashi- కాశీ ద్వాదశ ఆదిత్యులు;కాశీ క్షేత్రం దేవాలయాల నిలయం,పుణ్యాల రాశి అటువంటి కాశీ క్షేత్రం లో సూర్యభగవానుడి యొక్క ద్వాదశ దేవాలయాలు కలవు.ఈ ద్వాదశ ఆదిత్యుల దేవాలయాలలో సూర్యభగవానుడి యొక్క దివ్య శక్తి కలదు. ఈ ఆలయాల సందర్శన వలన భవ రోగాల నుండి విముక్తులం అవ్వవచ్చు.అంతే కాకుండా ఈ ఆలయాల పైన కొలరెడో బౌల్డర్  విశ్వవిద్యాలయంకి సంబంధించిన జాన్ మెక్ కిమ్ మాల్విల్లేకి మరియు బనారస్ విశ్వవిద్యాలయంకి సంబంధించిన రానా పి.బి.సింగ్ శాస్త్రవేత్తలు ఈ ఆలయాల పైన పరిశోధనలు చేసి ఈ ఆలయాలు ఉన్న ప్రదేశం లో సూర్య భగవానుడి యొక్క దివ్య శక్తి ఉందని సూర్య భగవానుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకివెళ్ళేటప్పుడు ఈ దివ్య శక్తి కూడా ఒక ఆలయం నుంచి ఇంకొక ఆలయంలోకి మారుతుందని కనిపెట్టారు. ఇప్పుడు ఇంతటి మహిమాన్విత దివ్య శక్తి కలిగిన ద్వాదశ ఆదిత్యుల యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం.

Lolarkha & Vimaladithyulu-లోలార్క & విమలాదిత్యులు:

పూర్వం కాశీ ఖండం ప్రకారం కాశీని దివోదాసు అనే రాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తుండేవాడు.ఒకసారి దివోదాసు శివుడు తో సహా భూమి మీద దేవతలు ఎవరు ఉండకూడదని శివుడిని వరం కోరుకున్నాడు.ఆ వరం ప్రకారం శివుడు తో సహా దేవతలందరు కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోతారు.అయితే కొంతకాలానికి శివుడు కాశీకి తిరిగి రావాలని అనుకున్నాడు అందుకు ముందుగా చతుష్షష్టి యోగిని గణములను కాశీకి పంపి ప్రజలను అధర్మ మార్గం అనుసరించేటట్లు చేయమని చెప్తాడు. అయితే వాళ్ళు విఫలం అవ్వడంతో ఈసారి సూర్యుడిని కాశీకి పంపుతాడు సూర్యుడు కూడా ఎంత ప్రయత్నించినా ప్రజలలో అధర్మ మార్గం వైపు మనసు మలచలేకపోయాడు,తిరిగి వెళితే శివుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించి కాశీలోనే 12 చోట్ల 12 మంది ఆదిత్యలుగా మారి స్థిరపడిపోయాడు. కాశీని చూసి సూర్యుడు ఆనందభరితుడయ్యాడు అలా ఆనందించిన ప్రదేశంలోనే లోలార్క ఆదిత్యుడిగా వెలిసాడు. ఈ లోలార్క ఆదిత్యడు  అస్సిఘాట్ కి వెళ్లే దారిలో ఆంధ్ర ఆశ్రమం వద్ద ఉంటుంది.ఈ ఆదిత్యుని దర్శనం చేత పాపాల వలన వచ్చే వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.

12 Surya Temples in Kashi

లోలార్క ఆదిత్య దగ్గర నుంచి విమలాదిత్యడు రెండు కిలోమీటర్ల దూరంలో గోదౌలియా దగ్గర్లోని జంగం వాడి సత్రం సమీపంలో ఉంటాడు.  కాశీ ఖండం ప్రకారం పూర్వం విమలుడు అనే క్షత్రియుడు కుష్టి రోగం వచ్చి రాజ్యం వదిలేసి కాశీకి వచ్చాడు. కాశీకి వచ్చిన అతను సూర్యుడిని ప్రతిష్టించి పుష్పాలతో రోజు పూజించేవాడు. విమలుడి పూజకి మెచ్చి ప్రత్యక్షమైన సూర్యుడు విమలుడిని కుష్టి రోగము నుంచి విముక్తుడిని చేశాడు. ఈ విమలుడు పూజించిన సూర్యుడిని విమలాదిత్యుడు అని అంటారు. విమలాదిత్యుడిని పూజించడం వలన భక్తులకు సర్వ వ్యాధులు మరియు సకల పాపములు తొలుగుతాయని వరం ఇచ్చాడు.

Samba & Uthararkha Adithyulu-సాంబ & ఉత్తరార్క ఆదిత్యులు:

విమలాదిత్యడు దగ్గర నుంచి 700 మీటర్ల దూరంలో సూరజ్ కుండ్ అనే ప్రాంతం వద్ద సాంబ ఆదిత్యుడు ఉంటాడు.కాశీ ఖండం ప్రకారం పూర్వం నారదుడి శాపం వలన కుష్టి రోగి అయినా కృష్ణుడు కొడుకు సాంబుడు శాపవిమోచనముకొరకై కాశీకి వచ్చి ఒక కుండం ఏర్పాటు చేసుకొని ఆ కుండానికి దగ్గరలోనే సూర్యుణ్ణి ప్రతిష్టించి పూజించసాగాడు. అలా కొంత కాలానికి కుష్టురోగం పోగొట్టుకుని తన సహజ సౌందర్య రూపం పొందుతాడు.అప్పటినుండి ఆ కుండమునకు సూర్యకుండమని ఆ ఆదిత్యడికి సాంబ ఆదిత్యుడు అని పేరు వచ్చింది. సూరజ్ కుండం లో స్నానం చేసి సూర్య భగవాన్ ని పూజించడం వలన వ్యాధులు రావని పురాణ ప్రశస్తి.

12 surya temples in Kashi

సాంబ ఆదిత్యుడు దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో కాశీకి ఉత్తరాన వారణాసి సిటీ స్టేషన్ దగ్గర ఉత్తరార్క ఆదిత్యుడు ఉంటాడు .కాశీ ఖండం ప్రకారం పూర్వం సులక్షణ అనే యువతి తన తల్లితండ్రులను పోగొట్టుకుని వివాహం జరగక చివరికి కాశీలో బ్రహ్మచర్య దీక్షతో ఆదిత్యుని కోసం తపస్సు ప్రారంభించింది.ఇలా జరుగుతూ ఉండగా రోజు ఒక తెల్లటి మేక ఆ ప్రదేశంకి వచ్చి సులక్షణను అలా చూస్తూ ఉండేది. కొంతకాలం గడిచాక ఆమె తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు సతీసమేతంగా ప్రత్యక్షమై వరం కోరుకోమనగ సులక్షణ ఆ నోరులేని మేకని అనుగ్రహించమని కోరుకుంది. ఆ మాటలకు సంతోషించిన శివుడు ఆ మేక వచ్చే జన్మలో కాశీరాజు కుమార్తెగా పుట్టి అన్నిభోగాలు అనుభవిస్తుందని, సులక్షణ పార్వతీదేవి యొక్క చెలికత్తె అవుతుందని వరం ఇచ్చాడు. ఈ ఉత్తరార్క ఆదిత్య గుడి వెనకాల ఉన్నసూర్య కుండం బర్కరి కుండంగ ప్రసిద్ధి చెందింది కాలక్రమేనా బక్రీకుండంగ పిలువబడింది.

Kesava & Khakholka Adithyulu-కేశవ & ఖఖోల్క ఆదిత్యులు:

ఉత్తరార్క ఆదిత్యుడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో వరుణ సంఘం ఘాట్ లో ఉన్న ఆదికేశమందరంలో కేశవాదిత్యుడు ఉంటాడు. పూర్వం ఒకసారి సూర్యుడు ఆకాశ మార్గంలో సంచరిస్తూ కాశీలో శివలింగాన్ని పూజిస్తున్న ఆదికేశవుడిని  చూసి అక్కడికి వస్తాడు విష్ణువు ద్వారా శివుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న సూర్యుడు అక్కడే ఒక స్పటిక లింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తాడు తదనంతరం అక్కడ మూర్తిగా వెలసి భక్తులని అనుగ్రహిస్తాడు. ఈ కేశవ ఆదిత్యుడిని పూజించడం వలన అజ్ఞానం తొలగి కోరికల నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా మోక్షానికి కారణమైన జ్ఞానం కూడా పొందుతారు ఈ కేశవ ఆదిత్యుడిని దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఖఖోల్క ఆదిత్యుడు ఉంటాడు.

12 surya temples in Kashi

ఈ ఖఖోల్క ఆదిత్యుడు త్రిలోచన ఘాట్ వద్ద ఉన్న కామేశ్వర్ మహాదేవ ఆలయంలో ఉన్నాడు.ఈ ఖఖోల్క ఆదిత్యుడు గురించి కాశీ ఖండం ప్రకారం ఈ విధంగా వివరించబడినది పూర్వం కశ్యప ప్రజాపతి యొక్క భార్య లైన వినత మరియు కద్రువ ఒకరోజు ఒక పందెం వేసుకుంటారు, అదేమిటనగా సూర్యుని గుర్రం యొక్క తోక నల్లని రంగులో ఉంటుందని కద్రువ లేదు తెల్లని రంగులో ఉంటుందని వినత వాదించుకుంటారు. అలా ఆ పందెంలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్లకి దాసిగా అవ్వాలని ఒక నిర్ణయానికి వస్తారు. తను పందెంలో ఓడిపోతాను అని గ్రహించిన కద్రువ తన సంతానమైన సర్పాలను సూర్యుని యొక్క గుర్రం తోకకు చుట్టుకోమని చెప్పి కపటంతో పందెం గెలిచి వినతను తన దాసిగా చేసుకుంది.కొంతకాలానికి వినతకి గరుత్మంతుడు జన్మించి వినతను దాసి విముక్తురాలిని చేస్తాడు. తదనంతరం వినత ఖఖోల్క ఆదిత్యుడిని ప్రతిష్ఠించి ప్రార్ధించగా సూర్యుడు ప్రత్యక్షమై ఈ ఖఖోల్క ఆదిత్యుని దర్శనం చేత విఘ్నాలు పోయి సర్వ పాపముల నుండి కూడా విముక్తులౌతారని అని వరం ఇస్తాడు. వినత ప్రతిష్ఠించిన సూర్యుడు కనుక వినతాదిత్యుడు అని కూడా అంటారు.

Aruna & Mayukha Adithyulu-అరుణ & మయూఖాదిత్యులు:

ఈ ఖఖోల్క ఆదిత్యునికి కొంచెం దగ్గరలో ఉన్న త్రిలోచన మహాదేవ ఆలయంలో అరుణాదిత్యుడు ఉంటారు. కాశీఖండం ప్రకారం పూర్వం కశ్యప ప్రజాపతికి ఇద్దురు భార్యలు కలరు. అందులో కద్రువకు చాలా మంది నాగ సర్పాలు సంతానంగా కలుగగా వినతకు మాత్రం ఎంతకాలమైనా తన కడుపులో ఉన్న రెండు శిశువులు జన్మించలేదు.అందుకు కోపంతో తన కడుపులో ఉన్న ఒక అండాన్ని పగలకొట్టింది. ఆ అండంలో నుంచి కింద భాగం ఏర్పడని ఒక శిశువు జన్మించాడు.ఊర్వులు(తొడలు) లేని వారు కనుక అనూర్వుడిగా పేరుగాంచాడు. అప్పుడు ఆ శిశువు కోపంతో తన తల్లి అయిన వినతని కద్రువకు దాస్యం చేయాలి అని శపిస్తాడు.అప్పుడు వినత అనూర్వుడిని శాపవిమోచనం కొరకు ప్రార్థించగా అందుకు అనూర్వుడు నీకు గరుత్మంతుడు అనే శిశువు జన్మించి నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని పలుకుతాడు.తదనంతరం అనూర్వుడు కాశీకి వచ్చి ఒక సూర్య భగవానుడిని ప్రతిష్ఠించి తపస్సు చేయగ సూర్య భగవానుడు ప్రత్యక్షమై అనూర్వుడికి అరుణుడిగా నామకరణం చేసి తన రథసారథిగా చేసుకుంటాడు. అరుణుడు ప్రతిష్ఠించిన ఆదిత్యుడు కనుక అరుణాదిత్యుడని అంటారు. ఈ  అరుణాదిత్యుడిని దర్శించడం వలన  భయము, దుఃఖము, దారిద్ర్యము, పాపములు మరియు వ్యాధుల బాధలు తొలగుతాయని వరం ఇస్తాడు.

12 surya temples in Kashi

అరుణాదిత్యుని దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో బాలాజీ ఘాట్ వద్ద మయూఖాదిత్యుడు ఉంటారు. పూర్వం సూర్య భగవానుడు స్వయంగా గబస్తీశ్వరడు అనే ఒక శివ లింగాన్ని మరియు మంగళ గౌరీ అనే ఒక అమ్మవారిని ప్రతిష్ఠించి తపస్సు చేసాడు. కేవలం కిరణాలు మాత్రమే కనిపించి శరీరం కనిపించదు కాబట్టి సూర్య భగవానుడిని మయూఖ ఆదిత్యుడు అని పిలుస్తారని శివుడు వరమిచ్చాడు. మయూఖము అంటే కిరణము అని అర్థం, ఎవరైతే ఈ మయూఖ ఆదిత్యుడిని పూజిస్తారో వారికి వ్యాధి మరియు దరిద్రబాదలు ఉండవని శివుడు వరం ఇస్తాడు. ఆదిత్యుడి తేజస్సు నుండి వచ్చే వేడిని చల్లార్చడానికి అన్నట్టుగా ఈ మయూఖ ఆదిత్యుడు ఎప్పుడూ తడిగానే ఉంటాడు.

Yama & Ganagadithyulu-యమ & గంగాదిత్యులు:

మయూఖాఆదిత్యుని దగ్గర నుంచి 400 మీటర్ల దూరంలో సింధియా ఘాట్ వద్ద యమ ఆదిత్యుడు ఉన్నాడు. కాశీఖండం ప్రకారం పూర్వం యమధర్మరాజు స్వయంగా యమ తీర్థంలో యమేశ్వర లింగాన్ని మరియు యమాదిత్యుడిని ప్రతిష్ఠించి తపస్సు చేసాడు. ఈ యమ తీర్థంలో స్నానం చేసి ఈ యమ ఆదిత్యున్ని దర్శించడం వలన యమలోక దర్శనం ఉండదు. కాలక్రమేణ యమ తీర్థం కనుమరుగైనది కనుక భక్తులు  దానికి బదులుగా గంగా నదిలో స్నానం చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ పిండ ప్రదానం చేస్తే గయోలో చేసిన శ్రాద్ధ కర్మ కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని కాశీఖండంలో వివరించబడినది.

Yamaaditya

ఈ యమ ఆదిత్యని దగ్గరలోనే లలితా ఘాట్ వద్ద ఉన్న నేపాలి మందిరం వద్ద గంగాదిత్యుడు ఉన్నాడు. కాశీఖండం ప్రకారం పూర్వం భగీరథుడు గంగాదేవిని భూమి మీదకు తీసుకువచ్చాడు. అలా భూమి మీదకు వచ్చిన గంగాదేవి ఎదురుగా ఉంటూ సూర్య భగవానుడు  అమ్మవారిని పూజిస్తూ శిలగా వెలిశాడు.ఈ రోజుకి కూడా ఎదురుగా ఉంటూ గంగాదేవిని స్తుతిస్తున్న గంగాదిత్యుడు మనకు దర్శనమిస్తుంది. ఈ ఆదిత్యుని దర్శనం వలన మనుషులు విశుద్ధులు అవుతారు అంతేకాకుండ ఈయనను పూజించిన వారికి దుర్గతి కలగదు.

Vruddha & Drupadadithyulu-వృద్ధ & ద్రుపదాదిత్యులు:

ఈ గంగాదిత్యుని నుంచి దగ్గరలో ఉన్న కాశీ విశాలాక్షి అమ్మవారికి గుడికి దక్షిణంగా వృద్ధ ఆదిత్యుడు ఉంటుంది. కాశీఖండం ప్రకారం పూర్వం కాశీలో హరితుడు అనే వృద్ధ బ్రాహ్మణుడు సూర్యుడిని ప్రతిష్ఠించిభక్తిశ్రద్ధలతో పూజలు చేసేవాడు. ఆయన పూజలకు మెచ్చిన భాస్కరుడు ఒకరోజు ప్రత్యక్షమై ఏం వారం కావాలో కోరుకోమని అడగగా ఈయన వార్ధక్యము చాలా దుర్లభమైనది మరణము క్షణమాత్రపు బాధ కానీ వృద్ధాప్యము ప్రతి క్షణము బాదే కాబట్టి తపస్సు చేసుకోవడానికి తిరిగి యవ్వనం ప్రసాదించమని సూర్యనారాయణమూర్తిని కోరాడు. అప్పుడు సూర్యనారాయణడు హరితుడికి యవ్వనం ప్రసాదించి తనను దర్శించి పూజించిన వారికి వృద్ధాప్య భాదలు తొలగుతాయని వరం ఇచ్చాడు.వృద్ధ బ్రాహ్మణుడు సూర్యుడిని ప్రతిష్ఠించి పూజించాడు కనుక ఈ ఆదిత్యుడు వృద్ధాదిత్యుడిగా ప్రసిద్ధిగాంచాడు

 Surya temples in Kashi

ద్రుపదాదిత్యుడు కాశీ విశ్వనాథ్ ఆలయం లో ఉంటాడు. కాశీఖండం ప్రకారం పూర్వం పాండవులతో కలిసి వనవాసానికి వచ్చిన ద్రౌపది దేవి సూర్య భగవానుడిని ప్రాదించగా సూర్యుడు ఒక అక్షయ పాత్ర ప్రసాదించి ప్రతిరోజూ ఎంత మంది అతిధులు వచ్చిన వారికి సరిపడ ఆహరం ఇందులో లభిస్తుందని వరం ఇచ్చాడు. అలాగే ద్రౌపది దేవి చేసిన తపస్సు కారణంగా నేను ఇక్కడ ద్రుపదాదిత్యుడు కొలువై ఉంటాను అని  తనను ప్రార్దించిన భక్తులకు ఆకలి భాదలు ఉండవని వరం ఇచ్చాడు. ఇంతటి తో ద్వాదశ ఆదిత్యుల చరిత్ర వివరణ సమాప్తం.

FAQ:

Leave a comment